Monday, January 28, 2008

భూతాపం యొక్క తీవ్ర పరిణామాలు ....


భూతాపం యొక్క తీవ్ర పరిణామాలు మొదలయ్యాయి - ఐ.పి.సి.సి (లారీ వెస్ట్ సమర్పణ)
భూతాపం అందరినీ ప్రభావితం చేస్తుంది కాని పేదలు తీవ్రంగా నష్టపోతారు. వాతావరణ మార్పులను అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తల బృందం
6 ఏప్రిల్ 2007 నాడు విడుదల చేసిన నివేదిక ప్రకారం 21 వ శతాబ్దంలో మరియు ఆ పై కాలంలో భూతాపం పరిణామాలు వినాశనకరంగా ఉండబోతున్నాయి. వాటి ప్రభావం అప్పుడే మొదలైంది కూడ!

భూమి పై ప్రతీ మనిషిని ప్రభావితం చేయనున్న గ్లోబల్ వార్మింగ్:

ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్‌గవర్నమెంటల్ పానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ( ఐ.పి.సి.సి) 130 దేశాలకు చెందిన 2500 మంది శాస్త్రవేత్తల పరిశోధనలను క్రోఢీకరించి 'క్లైమేట్ చేంజ్ 2007' అనే నివేదికని విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం భూమి పైన ఏ వ్యక్తి కూడ ఈ పరిణామాలనుంచి తప్పించుకోలేడు. ప్రపంచవ్యాప్తంగా పేదలు దీని బారిన పడనున్నారు. ఈ పరిణామాలు ప్రపంచంలోని ప్రతీ ప్రాంతంలోను, ప్రతీ స్థాయిలోను వ్యక్తమవుతాయి. ఐ.పి.సి.సి. ఛైర్మన్ మరియు భారత ఇంధన నిపుణుడు శ్రీ రాజేంద్ర కె పచౌరీ మాట్లాడుతూ...
" పేదలలో కెల్లా నిరుపేదలు, ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలలోని పేదవాళ్ళు సైతం భూతాపం దుష్ప్రభావానికి గురవుతారు. పేద ప్రజలు వాతావారణంలోని మార్పులకు తట్టుకోడం కష్టం! నా అభిప్రాయం ప్రకారం అలాంటి వారికి రక్షణ కల్పించడం ప్రపంచ దేశాల సామాజిక బాధ్యత....'' అని అన్నారు.2007లో నాలుగు భాగాలుగా విడుదలైన నివేదికలలోని రెండవ భాగం యొక్క సారాంశమిది. ఫిబ్రవరి 2007 లో విడుదలైన మొదటి భాగం - 20 వ శతాబ్దం మధ్య కాలం నుంచి హానికారక వాయువల విడుదలకి, భూమి మీద ఉష్ణోగ్రతలు పెరగడానికి మానవ తప్పిదాలే కారణమని, భూతాపాన్ని ఆపడం ఇప్పుడిక అసాధ్యమని స్పష్టం చేసింది.

భూతాపాన్ని తగ్గించడానికి తీసుకోవలసిన అత్యవసర చర్యలు:

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల కొన్ని ప్రాంతాలలో తాత్కాలిక ఉపయోగాలు కలుగుతాయి. మొదటిది పెరిగిన వర్షపాతం వల్ల పంటల సంఖ్య పెరిగి ఆహారోత్పత్తి పెరుగుతుంది. రెండవది శీతల వాతావరణం వల్ల కలిగే మరణాల సంఖ్య తగ్గుతుంది. అయితే ఇతర ప్రాంతలలో సంభవించే తీవ్రమైన కరవు, వరదలు, నీటికొరత, ఆకలి, రోగాలు వంటి వాటి ముందు ఈ తాత్కాలిక లాభాలు వెలవెలబోతాయన శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 'ఫ్రెండ్స్ ఆఫ్ ఎర్త్ ఇంటర్నేషనల్' సంస్థకి చెందిన పర్యావరణ కార్యకర్త కేథరిన్ పియర్స్ మాట్లాడుతూ..."గత 50 ఏళ్ళుగా పెరుగుతున్న భూతాపానికి మనల్ని మనమే నిందించుకోవాలి.మన గ్రహం పై జరుగుతున్న దుర్ఘటనలకి మనమే కారణం! మనం వ్యర్ధ విసర్జకాలను నియంత్రించకపోతే, ఇంకా దారుణాలు జరుగుతాయి. ప్రపంచంలోని లక్షలాది పేదవాళ్ళ జీవితాలు నాశనమవుతాయి. వాళ్ళు ఇళ్ళు, ఉపాధి కోల్పోతారు. వాతావరణ మార్పులంటే ఇక పై పర్యావరణానికి మాత్రమే సంబంధించినవి కావు. అవి మానవ జీవితాలతో ముడిపడి ఉన్నాయి. ఈ ఉత్పాతాలు విశ్వ రక్షణ, మనుగడలకే సవాలు....'' అని అన్నారు.



నివేదికలోని కీలక అంశాలు:

ఇప్పటికే కష్టాలు ఎదుర్కుంటున్న లక్షలాదిమందిని పర్యావరణమార్పులు మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తాయి. వేడి గాలులు, వరదలు, తుపానులు,కాటకాలు, అగ్ని ప్రమాదాలు వంటివి రోగాలకు, మరణాలకు కారణమవుతాయి. అంతేకాక, పోషకాహార లోపం వల్ల, నీళ్ళ విరోచనాల వల్ల, హృద్రోగాల వల్ల, కీటకాలు, ఎలకలు కలగజేసే రోగాల వల్ల కలిగే మరణాలకు భూతాపం కారణమవుతుంది.
ఇప్పటికే తుపానులను, కుండపోతలను ఎదుర్కుంటున్న సముద్ర తీరంలోని లోతట్టు ప్రాంతవాసులకు సముద్ర నీటి మట్టం పెరగడం వల్ల మరింత ముప్పు కలుగుతుంది. సగటు ఉష్ణోగ్రత కనక 1.5 నుంచి 2.5 డిగ్రీల సెల్సియస్ పెరిగితే, సుమారుగా 20 నుంచి 30 శాతం మేర వృక్ష జంతుజాలం తమ ఉనికిని కోల్పోయే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు, పారిశ్రామికీకరణ జరగక ముందు కాలంతో పోలిస్తే, 0.74 డిగ్రీల సెల్సియస్ పెరిగాయి. ఈ శతాబ్దంలోగా, హిమ ఫలకాలలోని నీరు మరియు మంచు క్షీణించి, పర్వతాల గుండా ప్రవహించే నదుల ద్వారా నీటిని సమకూర్చుకునే ప్రాంతాలకు ( ఈ ప్రాంతాలలోనే ప్రపంచంలోని ఆరోవంతు జనాభా నివసిస్తున్నారు) తీవ్రమైన నీటి కొరత ఏర్పడుతుంది. ఉదాహరణకు హిమాలయాలలోని మంచు తగ్గిపోయి హిమనీ నదులలో నీటి సరఫరా తగ్గిపోయి దిగువ ప్రాంతాలలో నీటి కొరత ఏర్పడుతుంది. తద్వారా భారత్, చైనా, నేపాల్, భూటాన్ వంటి దేశాలలో కోట్లాదిమంది పై ప్రభావం చూపుతుంది. 2020 సంవత్సరానికల్లా వాతావరణ మార్పుల వల్ల ఆఫ్రికాలో 70-250 మిలియన్ల మంది తీవ్రమైన నీటి కొరత ఎదుర్కుంటారు. ఇదే సమయంలో కొన్ని ఆఫ్రికా దేశాలలో వర్షాధారిత పంటల దిగుబడి తగ్గుతుంది. ఈ శతాబ్ద మధ్య కాలానికల్లా లాటిన్ అమెరికాలో బయోడైవర్సిటీ 50% మేర తగ్గిపోయే ప్రమాదం ఉంది. అమేజాన్ ప్రాంతంలో భూగర్భ జలాలు క్షీణించి ఉష్ణమండల అడవులు నశించి, గడ్డిభూములు ఏర్పడుతాయి.
ఇక చిన్న చిన్న పసిఫిక్, కరేబియన్ దీవులలో నివసించే వారి భవిష్యత్తు మరింత ప్రమాదంగా మారనుంది. సముద్ర మట్టం పెరగడం, తీర ప్రాంతాలలో క్షీణిస్తున్న పరిస్థితులు వారిని అభద్రతకి గురిచేస్తాయి. ఈ దీవులలోని వారికి మంచి నీటి కొరత ఏర్పడుతుంది. చేపల పెంపకం, పర్యాటక రంగం మరియు ఇతర ఉపాధి అవకాశాలు దెబ్బతిని స్థానికులు ఆర్ధికంగా ఇబ్బందుల పాలవుతారు.

నివేదిక పై విబేధాలు:

రాబోయే అవాంతరాల తీవ్రత గురించి శాస్త్రవేత్తలకు, రాజకీయవేత్తలకు మధ్య విబేధాలు నెలకొన్నాయి. చైనా, సౌదీ అరేబియా వంటి దేశాలనుంచి ఎదురైన రాజకీయ ఒత్తిడులకు తలొగ్గి నివేదికలో వాడిన భాషని సరళతరం చేయడం శాస్త్రవేత్తలకు ఆగ్రహం కలిగించింది.భూతాపం దుష్ఫలితాలను వెల్లడించే శాస్త్రవేత్తల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికే నివేదికలోని భాషని మార్చడం జరిగింది. గతంలో 90% మేర కచ్చితంగా ఎదురవగల సంఘటనలను ఉద్దేశ్యించి 'వెరీ హై కాన్ఫిడెన్స్' అనే పదాలు వాడేవారు. ఇప్పుడు వాటిని 'హై కాన్ఫిడెన్స్' అనే పదాలకు మార్చారు. దానర్ధం ఆయా సంఘటనలు ఎదురయ్యే అవకాశం 80% మేరకేనని!



పరిస్థితులకు తగ్గట్టు నడవడం, సమ అభివృద్ధి:

వ్యక్తుల, సంస్థల, ప్రభుత్వాల మరియు పరిశ్రమల కార్యకలాపాలను నియంత్రించడం ద్వారా కొంతమేర భూతాపాన్ని తగ్గించవచ్చని ఐ.పి.సి.సి పేర్కొంది. వారి నివేదికలో పేర్కొన్న దుష్ఫలితాలను అడ్డుకోడానికి ఈ చర్యలు సరిపోవని నివేదిక అభిప్రాయపడింది. ఇతర జీవులలానే మానవుడు కూడా పరిస్థితులకు అనుగుణంగా, మారుతున్న ప్రపంచానికి తగ్గట్టుగా మారాలి. అలా మారకపోతే, కాలక్రమంలో వినాశనం తప్పదని నివేదిక హెచ్చరించింది. అభివృద్ధి కూడ సమంగా ఉండాలి. సమ అభివృద్ధి భూతాపాల దుష్ఫలితాలను కొంత మేరకైనా తగ్గిస్తుంది. ప్రాంతాల మధ్య అసమానతలు తగ్గితే ప్రజలు మార్పులకు తగ్గట్టుగా తమని తాము మలచుకుంటారు. కాని దురదృష్టవశాత్తు ప్రపంచంలో అభివృద్ధి సమానంగా జరగడం లేదు.

భూతాపం నివారణకి కావల్సినవి:

భూతాపం అనేది ఓ స్థిరమైన లక్ష్యం కాదు. వాతావరణ మార్పులు కాలక్రమంలో మరింత పెరుగుతాయి. వాటి దుష్ఫలితాలు కూడ మరింత పెరిగి సకల మానవాళిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఫలితంగా మనం చేపట్టే చర్యలు అసంపూర్ణంగాను, అసమగ్రంగాను మిగిలిపోతాయి. వీటిని ఎదుర్కోవాలంటే ప్రపంచ వ్యావ్తంగా అన్ని దేశాల సమిష్టి కృషి, ఆర్ధిక మద్దతు అవసరం. "పర్యావరణ మార్పులకు కారణమైన అమెరికా వంటి గొప్పదేశాలు, భూతాపాన్ని తగ్గించే ఉద్యమాన్ని ముందుండి నడిపించాలి. హానికారక వాయువుల విడుదలను గణనీయంగా తగ్గించాలి. ప్రస్తుతం ఈ ఉద్యమం కోసం పారిశ్రామిక దేశాలు ఖర్చు చేస్తున్న నిధులు ఏ మాత్రం సరిపోవు. తాము కారణం కాని, దారుణమైన దుష్ఫలితాలను అనుభవిస్తున్న పేద దేశాలకు ఆర్ధిక సహాయం ఎంతో అవసరం...'' అని పియర్స్ చెప్పారు.



వ్యాసకర్త :

కొల్లూరి సోమశంకర్

పిచ్చుకలు ©Template Blogger Green by Dicas Blogger.

TOPO