Monday, March 17, 2008

పిచ్చుకలకే అది లేకుండా పోతోంది





















పిచుకల గురించి ఈ రోజు మార్చ్ 17,౨౦౦౮, ఆంఢ్రజ్యోతి దినపత్రిక చాలా మంచి వ్యాసం ప్రచురించింది.
http://andhrajyothy.com/mainshow.asp?qry=/2008/mar/౧౬మైన౩

పిచ్చుకలకే అది లేకుండా పోతోంది

ఊరపిచ్చుకల నుంచి తయారుచేసే లేహ్యం వాడితే సెక్స్‌ సామర్థ్యం పెరుగుతుందని ఓ నమ్మకం. అదెంత నిజమో కానీ.. పెచ్చు పెరిగిన కాలుష్యం ఆ ఊర పిచ్చుకల సెక్స్‌సామర్థ్యాన్నే దెబ్బతీసింది. చివరికి పిచ్చుకలకే అది లేకుండా పోతోంది. ప్రతికూల పరిస్థితుల్లో సంతానాన్ని ఉత్పత్తి చేయలేక క్రమేణా ఇవి కనుమరుగవుతున్నాయి. మిగతా పక్షిజాతులూ అంతర్ధానమయ్యే ప్రమాదముంది.

ఊర పిచ్చుకలు.. ఈ పేరెప్పుడో విన్నట్టు అనిపిస్తుంది కదూ.. ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఏనాడో మరిచిపోయిన ఆత్మీయ నేస్తాలు. పదిపదిహేనేళ్ల క్రితం వరకు మన ఇళ్లల్లోనే మనతోబాటే సహజీవనం చేసిన బంధువులు. ఈ చిరుప్రాణులు కనిపించక చాలా కాలం అయింది కదా.. అదొక్కటేనా.. దసరా రోజు ఊరు ఊరంతా వెదికి మరీ చూసే పాలపిట్ట ఇప్పుడు దుర్భిణి వేసి చూసినా కనిపించదేం. వడ్రంగి పిట్ట, చెవులు తూట్లు పడేలా అరిచే గోకరగాళ్లు ఏమయిపోయాయి. ఎక్కడికి వెళ్లి పోయాయివన్నీ.. క్షేమంగా ఉన్నాయా?

ఈ చిరు ప్రాణులకేమైంది?
ఒకనాడు ఎక్కడచూస్తే అక్కడ కనిపించిన ఊరపిచ్చుకలు ఇప్పుడు మీరు భూతద్దం వేసకుని గాలించినా కనిపించవు. పల్లెల్లో మితిమీరిన పురుగు మందుల వాడకం ఈ పక్షుల ఆహారాన్ని హాలాహలం చేస్తే, పట్టణాల్లో కాలుష్యం ఈ చిరుజీవులను చిదిమేసింది. ప్రస్తుతం ఈ జాతి ప్రమాదంలో ఉంది. ఇప్పటికైనా పరిరక్షించుకోకపోతే, వీటిని ఇకపై ఫొటోల్లో చూసుకోవాల్సిందే. ఎన్ని పక్షులు ఉన్నాయో తెలిపేందుకు లెక్కలు లేవు.. ఎన్ని పోయాయో చెప్పే అధ్యయనాలూ లేవు. కానీ, ఇప్పటికైనా వీటిని సంరక్షించుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా చర్యలు మాత్రం ప్రారంభమయ్యాయి. ఇప్పుడిప్పుడే ఊరపిచ్చుకలు ప్రమాదంలో పడడానికి గల కారణాలను అన్వేషించేందుకు పరిశోధనలు ప్రారంభ మయ్యాయి.

ఏమిటి ఈ పరిస్థితికి కారణం?
రాష్ట్రంలో వేగంగా పెరిగిపోతున్న పట్టణీకరణ ఊరపిచ్చుకలను ప్రమాదంలో పడవేసింది. మొదటి నుంచీ ఇళ్లల్లోనే నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు అలవాటుపడిన ఈ పక్షులకు అపార్టుమెంటులు, మల్టీస్టోర్డ్‌ బిల్డింగులు గూడును దూరం చేస్తే వాహన కాలుష్యం ఊపిరాడనివ్వ లేదు. నగరాల్లో ఇవి గూడు ఏర్పాటు చేసుకునే ప్రాంతాలు కరవయ్యాయి. ఆవాసాల కోసం విస్తారంగా చెట్లను నరికి వేయడంతో ఆహార కొరత ప్రారంభమైంది. ఇళ్లల్లో అందం కోసం పెంచుకునే చెట్లు ఈ పక్షలకు మేతను అందించ లేకపోయాయి. ఆహారం, ఆవాసం కోసం మిగతా బలమైన పక్షులతో ఇవి పోరాడాల్సి వచ్చింది. కాలుష్యంతోపాటు సెల్‌ఫోన్‌ సిగ్నళ్లు వీటి పునరుత్పత్తి సామర్థ్యం పైనా తీవ్ర దుష్ప్రభావం చూపాయి. దీంతో పట్టణాల్లో ఊరపిచ్చుకలు దాదాపుగా అంతర్ధానమయ్యాయి.

ప్రస్తుతం జంటనగరాల్లో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పరిసరాలు, లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ మురికి వాడలు, మహబూబ్‌ చౌక్‌ పక్షుల విక్రయదుకాణాల్లో తప్ప మరెక్కడా కనిపించడం లేదు. పల్లెల్లోనూ ఇలాంటి పరిస్థితులే. గ్రామీణ ప్రాంతాల్లో పురుగు మందులు, రసాయన ఎరువుల వాడకం పెరిగి పోవడంతో, ఈ పక్షుల ఆహారం విషతుల్య మైంది. ఇప్పటికీ ఈ పక్షులు కాస్తోకూస్తో కనిపిస్తున్నాయంటే.. అది పల్లెల్లోనే. ఇప్పుడు పల్లెలకూ పట్నం వాసనలు విస్తరిస్తుండడంతో .. మిగిలిన కొద్దిపాటి పక్షులు కూడా కనిపించకుండా పోయే ప్రమాదం మరెంతో దూరంలో లేదు.

సెల్‌ఫోన్ల ప్రభావం కూడా కారణమే..!!
ఊరపిచ్చుకల అంతర్ధానానికి సెల్‌ఫోన్‌ టవర్లు, సిగ్నళ్లు (విద్యుద యస్కాంత తరంగాలు) కూడా కారణమని సలీం అలీ సెంటర్‌ ఫర్‌ ఆర్నిథాలజీ అండ్‌ నేచురల్‌ హిస్టరీ(సెకాన్‌) డైరెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌. విజయన్‌ పేర్కొన్నారు. సెల్‌ఫోన్‌ సిగ్నళ్ల తీవ్రతకు, పక్షుల అంతర్థానానికి మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించేందుకు ఇప్పటికే జరిగిన పలు అధ్యయనాల్లో ఈ విషయం స్పష్టమైందని ఆయన వివరించారు. సెల్‌ఫోన్‌ సిగ్నళ్ల తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఊరపిచ్చుకలు మనుగడ సాగించలేవని ఇప్పటికే స్పెయిన్‌లో జరిగిన పరిశీలనలో తేటతెల్లమైంది. సెల్‌ఫోను యాంటిన్నాల నుంచి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు ఈపక్షులను తరిమివేస్తున్నాయని తాజాగా లండన్‌లోని బ్రిటీష్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఆర్నిథాలజీ సభ్యులు జరిపిన పరిశోధనల్లో తేలింది.

ఈ పరిశోధనల్లో దాదాపు 30వేల మంది పక్షి అధ్యయనకారులు పాలుపంచుకున్నారు. సాధారణంగా చాలా ఎత్తులో ఏర్పాటు చేసిన సెల్‌ఫోను టవర్ల నుంచి విడుదలైన విద్యుదయస్కాంత తరంగాలు చాలా దూరం విస్తరించి ఉంటాయి. ఇవి పక్షులపై అంతగా ప్రభావాన్ని చూపలేవు. కానీ ఎవరైనా ఫోన్‌ చేసినప్పుడు సెల్‌ఫోన్‌ యాంటెన్నాల నుంచి ఈ తరంగాల తీవ్రత విపరీతంగా పెరుగుతుంది. ఈ సిగ్నళ్లు చాలా దుష్ప్రభావం చూపుతాయి. పల్లెలు, పట్నాలని తేడా లేకుండా సెల్‌ వినియోగం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ తరంగాల తీవ్రతను తక్కువగా అంచనా వేయలేం. సెల్‌ఫోన్‌ టవర్లు ఏర్పాటుచేసిన ప్రాంతాల్లో ఊరపిచ్చుకలు అసలే నివాసం ఉండలేవు. ప్రస్తుతం విజయన్‌ నేతృత్వంలోని సెకాన్‌ పరిశోధకుల బృందం ఈ పక్షులపై సెల్‌ఫోన్‌ తరంగాలు ఎలాంటి ప్రభావం చూపుతాయో అధ్యయనం చేస్తోంది.

సెల్‌ తరంగాల వల్ల ఎలుకల వీర్యకణాల సంఖ్య తగ్గిపోయి నట్లు స్పష్టమైంది. అలాగే ఊరపిచ్చుకల కేంద్రనాడీ వ్యవస్థపై సిగ్నళ్ల ప్రభావం ఉండవచ్చని భావిస్తున్న పరిశోధకులు ఆ దిశగా పరిశోధనలు జరుపుతున్నారు. ఊరపిచ్చుకలు ఇళ్లలోకి దూరి అద్దంలో తమ ప్రతిబింబాన్ని చూసుకుని నానా హంగామా చేస్తుంటే.. అమాయకత్వం అని మనం నవ్వుకున్నాం కానీ.. కోల్పోయిన సహచరులను తమ ప్రతిబింబంలో చూసుకుని ఊరడిల్లుతున్నాయని గుర్తించలేకపోయాం. మానవునితో సన్నిహితంగా ఉండే ఈ పక్షులే ఇంతటి ప్రమాదకర పరిస్థితుల్లో ఉంటే.. మిగిలిన పక్షుల సంగతేమిటి. ఎన్ని ఉన్నాయి.. ఎన్ని పోయాయి. నాగరిక ప్రవాహంలో మునుముందుకే కొట్టుకుపోతున్న మనం.. నేడు వెనుదిరిగి చూసుకుంటే కొన్ని పక్షులు మాయమయ్యాయని గుర్తించాం. ఇకనైనా మేల్కొనకపోతే ఆ తరువాత మిగిలిన పక్షులనూ ప్రదర్శనశాలల్లో చూసుకోవాల్సిందే.

3 Comentários:

Sreenivas Paruchuri said...

Raajendra-gaaru,

Before publishing such sensational "facts" I wish that people - here Andhrajyothy journalist - also check the arguments from the other side and present us both versions; especially when the discussion is run very emotionally from the "environmental activists" side. The cell phone towers and electro magnetic waves have been held responsible for the decline of many other things as well; for e.g. bees.

See the following message:

http://groups.yahoo.com/group/Indo-Eurasian_research/message/9244

Regarding sparrows, the above mentioned BTO's site (British Trust for Ornthology; www.bto.org) doesn't have anything to say on the alleged negative impact of electro magnetic waves. Nor does Dr. Stutchbury, who herself is concerned with the stark decline of birds, supports this theory.

http://www.harpercollins.ca/songbirds/

To be fair to the AJ article, the article rightly stresses the tremendous damage caused by the (over and wrong)use of pesticides.

Regards,
Sreenivas

Rajendra Devarapalli said...

ధన్యవాదాలు శ్రీనివాస్ గారు,మీ లాంటి పెద్దల అభిప్రాయాలను భవిష్యత్తులో నయినా పరిగణనలోకి తీసుకొని వ్యాసాలు,వార్తలు వెలువరించే రోజులు రావాలని నా ఆకాంక్ష.

Anonymous said...

ఊరపిచ్చుక, పిచ్చుక ఒక్కటేనా

పిచ్చుకలు ©Template Blogger Green by Dicas Blogger.

TOPO