ప్రపంచమే ఒక పచ్చని పూలతోట
Visual Aid provided by NASA Jan. 2005
ఇది ప్రతివారూ స్వార్ధం పెంచుకుని,నేనేమిటి,నాపిల్లల భవిష్యత్తు ఏమిటీ అని ఒకటికి పది సార్లు ఆలోచించుకుని మరీ గడపదాటి బయటకు అడుగుపెట్టాల్సిన సమయం ఇది.కాకపోతే,నేను అంటే మనం,నాపిల్లలు అనగా అందరి పిల్లలు వారి భవిత అన్న విస్తృతార్ధం లో స్వార్ధచింతన పెంచుకుంటే ప్రపంచమే ఒక పచ్చని పూలతోట అవుతుందని గ్రహించగలగాలి.
అందరికీ తెలిసిన విషయమే గుంటూరు లో ఎండలు ఎక్కువని,కానీ మా కాలేజీలో కానీ,హాస్టలు గదిలో కానీ మాకు ఏనాడూ,ఫ్యానులు లేకపోయినా కూడా చల్లచల్లకూల్ కూల్ అన్నట్లు గడపగలిగామంటే అది ఏనాడో ఆంగ్లేయులు ముందుచూపుతో తీసుకున్న నిర్ణయఫలితం.మాకళాశాల కట్టడానికి వాడిన రాయి,ప్లాను ఇలాంటి వాటి గురించిన సాంకేతిక వివరాలు పెద్దగా తెలియకపోయినా అది కొండరాయి తో కట్టారని,అలాగే కట్టడంలొ కోడిగుడ్డు,బెల్లం,సున్నం వాడారని మాత్రం విన్నాను.అలాగే కాలేజీలో కొన్ని చోట్ల నిలబడితే గాలి విస్తారంగా వచ్చి ఉక్కిరిబిక్కిరి చేసేది, దానికీ గాలివాలును బట్టి అక్కడ కాసేపు నుంచుంటే?అన్న ఆలోచనతో కల్పించిన వెసులుబాటు.ఫిబ్రవరి,మార్చి,ఏప్రిల్ నెలల్లో మధ్యాహ్నం భోజనం అయ్యాక ,తరగతి గదిలోని చల్లదనానికి,ముందు బెంచీమీద పడి మరీ నిద్రపోవటం,మరి ముఖ్యంగా సైకాలజీ క్లాసులో చాలా సాధారణదృశ్యం,కానీ బియ్యే ఫైనల్ ఫలితాల్లో నాకు ఆసబ్జెక్టులో యూనివర్శిటీఫస్టు రావటం మా చార్లెస్ వెస్లీ సారుకీ మైల్డ్ హార్ట్ ఎటాక్ వచ్చినంత పనవ్వటం వేరే ముచ్చట..ఇంతకీ మీకు మాకాలేజీ పేరు చెప్పలేదుకదా ఆంధ్రక్రైస్తవకళాశాల(Andhra Christian,College)మాహాస్టలు పేరు ఉల్ఫ్ హాల్(wolf Hall).
తర్వాత యూనివర్శిటీలో చేరాను,విశ్వవిద్యాలయ స్థాపననాటినుంచి ఒక్క హాస్టలు రూములోకూడా చెమట,వేడి అన్నమాట వినిపించేది కాదు.1991-92 వరకూ హాస్టలు గదుల్లో ఫ్యానులుండేవి కాదంటే నమ్మగలరా?ఇప్పటికీ క్యాంపస్ లో చెట్లకిందకూర్చుని రోజులతరబడి గడపటం,ఊటీ,సిమ్లాల్లో విహరించటం కన్నా ఎక్కువ అని నా ప్రగాఢవిశ్వాసం.నేను యం.యే చేరిన నాటికీ ఇప్పటికీ మెయిన్ క్యాంపస్లో గానీ,అనుబంధకళాశాలల్లో చాలా కొత్తకట్టడాలు వచ్చాయి,కానీ నూతనభవనాల్లో ఫ్యానులు కాదు కదా ఏసీలేకపోతే ఉండలేము అనిపిస్తుంది.ఎందుకొచ్చిన మార్పు ఇది?భవననిర్మాణరంగంలో చాలా పురోగతి ఉన్నా,వేడి,ఉక్కపోతలను తగ్గించలేకపోగా,ఎయిర్ కండిషనింగ్ లేకపోతే బతకలేము లోపల అన్న స్థితి రావటానికి బయట పెరుగుతున్న వేడిమి కారణం ప్రధానంగా.
ఇది ఒక్క విశాఖపట్నానికో,గుంటూరుకో కాక విశ్వవ్యాప్తంగా సంభవిస్తున్న సమకాలీన విషాదాల్లో పెరుగుతున్న భూతాపం పతాకశీర్షికలకు అర్హమైంది.పెరుగుతున్నభూతాపం కొన్ని దేశాల వల్ల కొంత ఎక్కువ,మరికొన్ని దేశాల్లో తక్కువగా ఉండొచ్చు కానీ,తద్వారా సంభవించబోయే,సంభవిస్తున్న దుష్పరిణామాలకు మాత్రం ప్రపంచంలోని ఏఒక్కరూ,చివరకు ఒక్క అంగుళం కూడా మినహాయింపు కాని దినాలు రాబోతున్నాయి.అభివృద్ధికి సూచికలుగా ఒకనాడు పరిగణించబడ్డ ప్రతిదీ ఇవ్వాళ ఒక శత్రువుగా రూపాంతరం చెందాయా అన్నంత స్థాయిలో ఇవ్వాళ ప్రమాదఘంటికలు మోగుతున్నాయి.వినిమయవాదం పెచ్చరిల్లిన ఈనాటి సమాజం లో అన్నదాతైన రైతుగూర్చి పట్టించుకున్న పత్రికలు,టీవీచానళ్ళు,వెబ్సైట్లు,పోర్టల్స్ లేనప్పుడు(కనీసం తెలుగులో),ఇక భూతాపం పెరుగుదల,కరిగిపోతున్న గ్లేసియర్లు,గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇలాంటి వాటి గురించి రాసెదెవ్వరు,సాధారణ ప్రజానీకానికి తెలియజెప్పేదెవ్వరు?
నడమంత్రపు సిరులు తెచ్చిన జీవనశైలి లోని మార్పులు కొన్ని,మరికొన్ని కొనకపోతే ప్రధానజనజీవన స్రవంతి నుంచి వెలివేస్తారేమోనని తెచ్చి నింపుతున్న వస్తుశ్రేణులవల్ల,మనం ఇళ్ళల్లో వాడుతున్న బల్బుల దగ్గరనుంచీ,ఫ్రిజ్,టీవీ,ఏసీ,వాషింగ్ మిషన్,ఫ్యాన్లు,ద్విచక్రవాహనాలు,కార్లు,..ఈ జాబితా అనంతం అన్నిటి వల్లా భూతాపం పెరుగుతూనే ఉంటుంది.అలాఅని వీటి వాడకాన్ని మానమని ఎవరూ అనరు,కానీ వాడకంలో కాస్త వివేచన,మరి కాస్త పిసినారితనం పెంచుకోమని అభ్యర్దిస్తున్నారు పర్యావరణకార్యకర్తలు.త్వరలో రానున్న బత్తీబంద్ కార్యక్రమం వల్ల ఆకాశానికో,లేక ఓజోన్ పొరకో పడుతున్న చిల్లులు పూడిపోతాయని ఎవరూ దురాశపడటంలేదు.కానీ కొంత సమయం ఇంటిలోని దీపాలకు శెలవు ఇవ్వటం అదీ రాత్రి వేళల్లో,ఇంటిల్లిపాదినీ ఈ భూతాపంపెంపు నుంచి మినహాయింపు పొందేందుకు చేస్తున్న కృషిలో ప్రత్య్క్షక్షంగా భాగస్వాములని చేసి ఒక అవగాహనను పెంచే చిరుప్రయత్నం మాత్రమే అని గ్రహించాలి.ఒక గంట దీపాలకు విరామం ఇవ్వటం వల్ల ఇంటిలోని మిగిలిన ఎలక్ట్రానిక్,ఎలక్ట్రికల్ పరికరాలకన్నిటికీ కూడా కాస్త పనితగ్గుతుంది,ముఖ్యంగా విరామమెరుగక వాగే టీవీలకు,అలాగె ఆ కాసేపూ ఇంటిల్లపాదీ బయట నిలబడి ఆకాశాన్ని,చుక్కలనూ,మబ్బులనూ,చంద్రుడినీ చూసి మీపిల్లలకు మీరు పిల్లలు గా ఉన్నప్పుడు చూసిన ఆకాశంలో ఏనుగులు,గుర్రాల కధలు చెప్పొచ్చు.అందరూ అలా నిలబడి మేఘాలను తిలకించి ఎన్నేళ్ళయ్యిందంటారు?
కొత్తపాళీ గారు చేపట్టిన ఈ "వెలుగులను మిగిల్చే" కార్యక్రమానికి తలా ఒక రూపంలో సాయపడదాం.
3 Comentários:
బావుంది, రాజేంద్రా.
దీనికి బత్తీబంద్ బ్లాగు నించి లింకిస్తాను.
బాగా చెప్పారు రాజేంద్ర గారూ.
ఈనడమంత్రపుసిరుల వ్యామోహం మోతాదుకి మించిపోతోంది.
అలాగే కట్టడంలొ కోడిగుడ్డు,బెల్లం,సున్నం కలపడం - ఈసంగతి నాకు తెలీదు కానీ ఆ కట్టడాలు మాత్రం మంచి నేర్పరితనంతో కూడుకున్నవి అని తెలుసు. అసలు ఆదృష్చే వేరు.
గ్లోబల్ వార్మింగనేది మానవజాతిని ముంచెత్తబోతున్న ఒక ఉపద్రవం. దీనిపై చాలా చాలా మందికి అసలు అవగాహనేలేదు. ముందు అవగాహన కల్పించటం అనేది దీనిని గురించి తెలుసుకొన్నవారి ప్రధమ కర్తవ్యం. ఇటీవలి కాలంలో ఎయిడ్స్ పట్ల అవగాహన విషయంలో 5 సంవత్సరాల క్రితంతో పోలిస్తే ఈ రోజు కొంచెం మెరుగ్గానే ఉన్నామని భావించవచ్చు. ఎంతో సున్నితమైన అటువంటి అంశాన్నె చదువరులు, ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లగలిగారu, చాలా మట్టుకు సఫలీకృతమయ్యారు.
ఇక గ్లోబల్ వార్మింగ్ వద్దకు వచ్చేసరికి ఇందులొ వ్యక్తిగతంగా అనుభవించే విషయాలు తక్కువగానూ, సంఘపరంగా ఎదుర్కోవలసిన అంశాలు ఎక్కువగానూ ఉంటాయి. కనుక అందరితోపాటూ మనమూ పోతాము అనె మెట్ట వేదాంతం ప్రతి ఒక్కరిలో చోటుచేసుకుంటుంది. దీనిని చేదించాలంటే ముందు ప్రజలలో అవగాహన కల్పించాలి. ఈ అవగాహన కూడా ఎలా ఉండాలంటే మన భారతీయతత్వం భోదించిన ' సర్వేజనో సుఖినోభవంతు " అనే తత్వాన్ని అలవర్చుకొనేదిగా ఉండాలి. దీనికి స్కూళ్లని ప్రాతిపదికగా తీసుకొని పాఠ్యాంశాలలో పర్యావరణ విద్యను చేర్చాలి. ఈ ప్రక్రియ ఇప్పుడే మొదలయ్యింది. ఇంటార్మీడియట్ స్థాయిలో పర్యావరణ విద్య అని ప్రత్యేక పేపరును ప్రవేశపెట్టిన ప్రభుత్వాన్ని అభినందీంచక తప్పడు.
సమాజపరంగా చదువరులు చేయాల్సిన పని ఈ సందేశాన్ని పంచటం. ఇది మనందరి భాద్యత. ఇలా చెయ్యటం వలన విషయం పట్ల సామాన్యులకు కుతూహలం వస్తూంది. పులిరాజా కు ఎయిడ్శ్ వస్తుందా? హోర్డింగు కలిగించిన కుతూహలం లాంటిది. ఈ బత్తి బంద్ అంతకంటే ఎక్కువ కుతూహలాన్ని కలిగిస్తుందని నా నమ్మకం. తద్వారా మన సందేశాన్ని తెలియచేసె అవకాసాన్ని మనం పొందుతాం.
కనుక అందరం చేయీ చేయీ కలుపుదాం బత్తి బంద్ ని విజయవంతం చేద్దాం.
Post a Comment